సుఖలౌ సౌందర్యం!

స్వప్నవీధిన మదితలపుల మలుపులో అభిమానం ఆర్ద్రతయింది.. 

కొద్ది దూరంగా అక్కడో పచ్చటి పెళ్లి పందిరి. అటూ ఇటూ వచ్చిపోయేవారితో బాగా హడావుడిగా ఉంది. ఎవరిదో పెళ్లి ఘనంగా జరుగుతుందన్నట్లుందే అననుకుని అడుగుపెట్టేసరికి అది నా పెళ్ళే అని తెలియ తెలివి వచ్చే! కనుమబ్బుల దోబూచులాటనుంచి తేరుకునేసరికి పెళ్లి వేదికనెక్కి చుట్టూ వచ్చిన అతిధులను, ఆత్మీయులను పరికించి దరహాసంతో పలకరిస్తూ వచ్చి కొద్దిగా అటువైపు తిరిగి కూర్చున్న ఒకావిడ దగ్గర మాత్రం సంభ్రమాశ్చర్యాలతో ఆగిపోయాయి నయనాలు.


కొప్పున నాలుగైదు మోరల  మల్లెలతో బంగారు కనకామ్బరాలు పొదిగినట్లున్న పచ్చని పట్టుచీరలో ముగ్ధమనోహరంగా మెరిసిపోతుందావిడ. ఈవిడని ఎక్కడో చూసినట్లుందే అననుకుని ఆలోచించేలోపే ఆవిడొకసారి ఇటువైపు తిరిగి తనని పలకరించిన వారితో తనదైన శైలిలో(వంగమూతి) చిరునవ్వు నవ్వి మళ్ళీ అటువైపు తిరిగి మాటలలో పడిపోయారు. ఆ నయనాందకర ముఖవర్చస్సుని గాంచిన వెంబడే నా ఆశ్చర్యం ద్విగుణీకృతమయింది. ఈవిడ నిజంగా నేనకునే ఆవిడేనా లేక నా కలలో భ్రమా  అననుకుంటూ ఉండగనే మళ్ళీ కనుమబ్బులు దోబూచులాడుకున్నాయి నాతో!

అది చదివింపుల/ఆశీస్సుల ఘట్టం.. ఒకరితర్వాత ఒకరు వచ్చి దీవించి వెళుతున్నారు. పచ్చని పట్టుచీరావిడ ఎక్కడా అని ఎదురుచూస్తున్నా..ఆ తలపు మలుపులో కరిగిపోలేదు కదా అననుకుంటూ!. అంతలోనే ఆవిడ రానే వచ్చారు. చాలా దగ్గరగా వస్తుండడంతో ఆవిడ నేనకునే వారేనని స్పృష్టమవుతుంది. కానీ ఏదో మూల ఒకింత ఆవంత అనుమానం. అంతలోనే ఆవిడ నేనకునే ఆవిడేనని ఎవరో గట్టిగా చెప్పి నా అనుమానాన్ని పటాపంచలు చేసి ఉద్వేగాన్ని ఉరకెలిత్తించారు. మనసు ఆనందడోలికలలో మునిగితేలసాగింది.

ఆ పచ్చని పట్టుచీరలో వచ్చిన కన్నడ కస్తూరి ఆంధ్రులు మెచ్చి ఆదరించిన ఆడపడచేనని, బాహ్యసౌందర్యం కన్నా అంతఃసౌందర్యం మిన్నంటూ ఆహార్యంలో అవధులు దాటకుండా తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటి సౌందర్య గారే అని అర్ధం చేసుకున్న మరుక్షణాన స్వప్నవీధిన మదితలపుల మలుపులో అభిమానం ఆర్ద్రతయింది.
ఈ అభిమాన సోదరుడిని దీవించడానికే ఆవిడ ప్రత్యేకంగా వచ్చారని తెలిసి నవనాడులూ ఉత్సాహఉద్వేగభరితమై చెమ్మగిల్లిన నయనాలతో ఆమెను చిరునవ్వుతో పలకరించా.  ఆవిడ తన నిండైన మనసుతో మమ్మల్ని ఆశీర్వదించి ఏవో కానుకలు చదివించారు. కలలో కూడా ఊహించనివి కలలోనే జరుగుతుంటే ఉబ్బితబ్బిబ్బై ఆమె, ఆమె అద్భుత నటన గురించి నే చెప్పాలనుకున్న సంగతులన్నీ ఏకరవుపెట్టాలని ఉన్నా ఆ పరమానందక్షణాన మనసు మౌనమేలి మాట మూగబోయింది. కానే అదే మనసు ఆవిడని పక్కనే కూర్చోమని బలవంతబెట్టింది..
            
మరలా కనుబొమ్మలు దోబూచులాడినవేళ,  అక్కడో ఎర్రరంగు పట్టుచీర కట్టుకున్నావిడ పిల్లలతో కలిసి సామజవరగమనా ఆలపిస్తున్నారు. ఆవిడను చూపిస్తూ ఎవరావిడ? అనడిగారు నన్ను! ఆవిడ శంకరాభరణం రాజ్యలక్ష్మి గారు కదూ అన్నాన్నేను కొద్దిగా గట్టిగనే.  వెంటనే చటుక్కున్న తిరిగిన రాజ్యలక్ష్మి గారు చారడేసి కళ్ళతో మా ఇద్దరినీ అభిమానంగా పలకరించి మళ్ళీ సా..గ..నా లో మునిగిపోయారు..                                

తర్వాత ఏమైందో...! వేచి చూడాలి!!!