సుఖలౌ సౌందర్యం!

స్వప్నవీధిన మదితలపుల మలుపులో అభిమానం ఆర్ద్రతయింది.. 

కొద్ది దూరంగా అక్కడో పచ్చటి పెళ్లి పందిరి. అటూ ఇటూ వచ్చిపోయేవారితో బాగా హడావుడిగా ఉంది. ఎవరిదో పెళ్లి ఘనంగా జరుగుతుందన్నట్లుందే అననుకుని అడుగుపెట్టేసరికి అది నా పెళ్ళే అని తెలియ తెలివి వచ్చే! కనుమబ్బుల దోబూచులాటనుంచి తేరుకునేసరికి పెళ్లి వేదికనెక్కి చుట్టూ వచ్చిన అతిధులను, ఆత్మీయులను పరికించి దరహాసంతో పలకరిస్తూ వచ్చి కొద్దిగా అటువైపు తిరిగి కూర్చున్న ఒకావిడ దగ్గర మాత్రం సంభ్రమాశ్చర్యాలతో ఆగిపోయాయి నయనాలు.


కొప్పున నాలుగైదు మోరల  మల్లెలతో బంగారు కనకామ్బరాలు పొదిగినట్లున్న పచ్చని పట్టుచీరలో ముగ్ధమనోహరంగా మెరిసిపోతుందావిడ. ఈవిడని ఎక్కడో చూసినట్లుందే అననుకుని ఆలోచించేలోపే ఆవిడొకసారి ఇటువైపు తిరిగి తనని పలకరించిన వారితో తనదైన శైలిలో(వంగమూతి) చిరునవ్వు నవ్వి మళ్ళీ అటువైపు తిరిగి మాటలలో పడిపోయారు. ఆ నయనాందకర ముఖవర్చస్సుని గాంచిన వెంబడే నా ఆశ్చర్యం ద్విగుణీకృతమయింది. ఈవిడ నిజంగా నేనకునే ఆవిడేనా లేక నా కలలో భ్రమా  అననుకుంటూ ఉండగనే మళ్ళీ కనుమబ్బులు దోబూచులాడుకున్నాయి నాతో!

అది చదివింపుల/ఆశీస్సుల ఘట్టం.. ఒకరితర్వాత ఒకరు వచ్చి దీవించి వెళుతున్నారు. పచ్చని పట్టుచీరావిడ ఎక్కడా అని ఎదురుచూస్తున్నా..ఆ తలపు మలుపులో కరిగిపోలేదు కదా అననుకుంటూ!. అంతలోనే ఆవిడ రానే వచ్చారు. చాలా దగ్గరగా వస్తుండడంతో ఆవిడ నేనకునే వారేనని స్పృష్టమవుతుంది. కానీ ఏదో మూల ఒకింత ఆవంత అనుమానం. అంతలోనే ఆవిడ నేనకునే ఆవిడేనని ఎవరో గట్టిగా చెప్పి నా అనుమానాన్ని పటాపంచలు చేసి ఉద్వేగాన్ని ఉరకెలిత్తించారు. మనసు ఆనందడోలికలలో మునిగితేలసాగింది.

ఆ పచ్చని పట్టుచీరలో వచ్చిన కన్నడ కస్తూరి ఆంధ్రులు మెచ్చి ఆదరించిన ఆడపడచేనని, బాహ్యసౌందర్యం కన్నా అంతఃసౌందర్యం మిన్నంటూ ఆహార్యంలో అవధులు దాటకుండా తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటి సౌందర్య గారే అని అర్ధం చేసుకున్న మరుక్షణాన స్వప్నవీధిన మదితలపుల మలుపులో అభిమానం ఆర్ద్రతయింది.
ఈ అభిమాన సోదరుడిని దీవించడానికే ఆవిడ ప్రత్యేకంగా వచ్చారని తెలిసి నవనాడులూ ఉత్సాహఉద్వేగభరితమై చెమ్మగిల్లిన నయనాలతో ఆమెను చిరునవ్వుతో పలకరించా.  ఆవిడ తన నిండైన మనసుతో మమ్మల్ని ఆశీర్వదించి ఏవో కానుకలు చదివించారు. కలలో కూడా ఊహించనివి కలలోనే జరుగుతుంటే ఉబ్బితబ్బిబ్బై ఆమె, ఆమె అద్భుత నటన గురించి నే చెప్పాలనుకున్న సంగతులన్నీ ఏకరవుపెట్టాలని ఉన్నా ఆ పరమానందక్షణాన మనసు మౌనమేలి మాట మూగబోయింది. కానే అదే మనసు ఆవిడని పక్కనే కూర్చోమని బలవంతబెట్టింది..
            
మరలా కనుబొమ్మలు దోబూచులాడినవేళ,  అక్కడో ఎర్రరంగు పట్టుచీర కట్టుకున్నావిడ పిల్లలతో కలిసి సామజవరగమనా ఆలపిస్తున్నారు. ఆవిడను చూపిస్తూ ఎవరావిడ? అనడిగారు నన్ను! ఆవిడ శంకరాభరణం రాజ్యలక్ష్మి గారు కదూ అన్నాన్నేను కొద్దిగా గట్టిగనే.  వెంటనే చటుక్కున్న తిరిగిన రాజ్యలక్ష్మి గారు చారడేసి కళ్ళతో మా ఇద్దరినీ అభిమానంగా పలకరించి మళ్ళీ సా..గ..నా లో మునిగిపోయారు..                                

తర్వాత ఏమైందో...! వేచి చూడాలి!!!




గమ్మత్తు..హాశ్చర్యాన్ని కలిగించిన కరిగిపోని కల..ఇది


మూడేళ్ళక్రితం ఒక కలవచ్చి దానికి అనుబంధంగా మళ్ళీ వచ్చి నన్ను హాశ్చర్యకితుడిని చేసిన కల ఇది..ఆ వైనమేమనగా..

మూడేళ్ళ క్రితం వచ్చిన కల :
ఎత్తైన ప్రదేశం..చుట్టూ పచ్చికబయళ్ళు. అటూ ఇటూ చూసుకుంటూ నడుస్తూన్నాను . అలా నడుచుకుంటూ ఒక దరికి రాగా ఆ ఎత్తైన ప్రదేశం నుంచి కిందకి వెళ్ళడానికి కొన్ని రాతిమెట్లు కనిపించాయి. కొద్ది మెట్లు దిగినతర్వాత కుడివైపున దూరంగా కొన్ని పెద్ద భవనాలు..ఇళ్ళు..ఒక ఊరులా ఉంది. ఎడమవైపున ఒక కంచె..కంచెకి ఆవలవైపున ఒక కుర్రాడు పిల్లనగ్రోవిని  వాయిస్తున్నాడు. పిల్లవాడు కూర్చున్నది వేరే దేశంలా ఉంది. ఒక ఆకుపచ్చజెండా ఎదో లీలగా కనిపించింది. బహుశా పాకిస్తాన్ అయ్యుండొచ్చు.. నన్ను చూసి నవ్వాడా పిల్లోడు.. నేనూ ప్రతిగా నవ్వి మెట్లుదిగి కుడివైపుగా సాగి ఊళ్లోకి అడుగుపెట్టా. అంటే ఆ ఊళ్ళో చదువుకోడానికి నేనొచ్చాను.

అది ఒక పెద్దభవనం..తగ్గట్లుగా పెద్దప్రహరీగోడ...పెద్ద వీధివాకిలి. వాకిలి తీసి లోపలికి అడుగుపెట్టాను. పదీపదిహేను కుటుంబాలు ఆ ఇంట్లో నివాసం ఉండేట్లు ఉన్నాయి.  పిల్లలతో హడావుడిగా గోలగోలగా ఉంది. నేను కొత్తవాడిగా అడుగుపెట్టడంతో అందరూ మొదట వింతగా చూసినా తర్వాత ఆత్మీయతనిండిన కళ్ళతో ఆపైన చిరునవ్వుతో మౌనంగా పలకరించారు. ఆ భవన యజమాని ఇంటి తలుపు కొట్టాను.  ఒక పెద్దాయన..యజమానిలా ఉంది..బయటికి వచ్చి చిరునవ్వుతో పలకరించారు. తర్వాత ఒకరి తర్వాత ఒకరు నన్ను అభిమానంగా పలకరిస్తూ నా వివరాలు అడుగుతున్నారు. వారే భాషలో అడుగుతున్నారో కలలో తెలీకపోయినా నేను  తెలుగే కాబట్టి వారు మాట్లాడింది తెలుగే అనుకున్నా.  పరిచయం అయి ఇంట్లో చేరిన కొద్దిరోజుల్లోనే అందరితో కలిసిపోయా.. ముఖ్యంగా ఇంటి యాజమాని కుటుంబానికి నేనంటే అమితమైన ఇష్టం.  ఒక్కడినే కావడంతో నా గదిలోఉండడం కన్నా వారి౦ట్లోనే ఎక్కువగా గడుపుతూ "సత్రం తిండి- మఠ౦ నిద్ర" అన్నట్లుగా జీవితాన్ని చదువునూ లాక్కొస్తున్నాను.

అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయిలా ఉంది. చదువువయిపోయింది. ఇప్పడిక ఉద్యోగం చూసుకోవాలి. యింటి యజమాని తనకి తెలిసినవాళ్ళ దగ్గర ఉద్యోగావకాశం ఉందని వారి వివరాలు ఇచ్చి కలువమని చెప్పారు. వారిని కలవడానికి ఇచ్చిన గుర్తులు.. నేనుండే చిన్నవీధి దాటి  పెద్దవీధిలో ఆడుగుపెట్టి పెద్దవీధి కొనాక్కి వస్తే అమ్మవారిది  చిన్నగుడి ఉంటుంది. ఆ గుడికి ఎదురుగా మరో వీధి..ఆ వీధిలో ఒక పెద్దగుడి.. ఆ గుడికిఎదురు వీధిలో నేను కలవాల్సిన వారి ఇల్లు. వారిని కలిసాను. వివరాలు అడిగిన తర్వాత ఏదో కాగితం ఇచ్చారు..బహుశా ఉద్యోగంలో చేరడానికి అనుమతిపత్రం అయ్యుంటుంది.  ఆ తర్వాత ఏమయిందో తెలీదు. అది అప్పటికి గుర్తున్న కల.    

మూడేళ్ళ తర్వాత  మొన్న వచ్చిన కల:
పై కలలో చెప్పినట్లు అదే ఎత్తైన ప్రదేశం.. అవే పచ్చికబయళ్ళు..రాతి మెట్లు.. కుడివైపు ఊరు..ఎడమవైపు పిల్లాడు..పిల్లనగ్రోవి.. బహుశా ఇప్పుడు పెద్దవాడయ్యుంటాడు. యధావిధిగా కుడివైపు నడుచుకుంటూ ఊళ్లోకి అడుగుపెట్టి అదే భవనం దగ్గరికి వెళ్లి వాకిలి తీసాను. ఇంతకుముందున్నంత హడావుడిగా గోలగా లేదు ఇల్లు. నిశ్శబ్దంగా ఉంది. ఇంటి యాజమాని ఉండే ఇంటి తలుపు కొట్టాను. నాకు తెలిసిన యాజమాని కాకుండా వేరెవరో వచ్చి ఏంటని అడిగారు.  ఇక్కడ ఉద్యోగం చేయడానికి వచ్చానని ఈ ఇంటియాజమాని బాగా తెలుసనీ చెప్పాను. దానికా వ్యక్తి ఇంటి పాత యాజమాని ఇల్లు తనకి అమ్మేసి చాలా ఏళ్ళ క్రిందట నుంచే  పట్టణంలో నివాసం ఉంటున్నారనీ, నాకు ఇష్టమైతే ఖాళీగా ఉన్న ఒక వాటాలో  ఉండవచ్చని చెప్పాడు. సరే అని నేను నా సహధర్మచారిణితో అక్కడే ఉండిపోయా. అంటే పెళ్లయిందన్నమాట :)

అలా అదే ఊరిలో ఉండి రైలులో పట్టణానికి వెళ్లి ఉద్యోగం చేసివస్తూ జీవితాన్ని గడుపుతున్నాను.  ఆ దైనందినంలోనే ఒక రోజు.. ఏదో ఆలోచనలో ఉండి నేను దిగాల్సిన స్థలంలో దిగడం మరిచాను. అసలే కొత్తకదా.. తెలీని ఆందోళన పులుముకుంది. ఇప్పుడే౦ చేయాలి అన్నట్లు ఆలోచిస్తుంటే వెనకాలనుంచీ "బాబూ" అన్న పిలిపు వినిపించింది. ఏదో తెలీని ఆత్మీయత..ఎప్పుడో విన్నగొంతులాగా అనిపించింది. వెంటనే వెనక్కి తిరిగి ఆ ముసలాయన దగ్గరికి చేరుకుని ఏంటి  అనడిగాను. "నన్ను గుర్తుపట్టలేదా నువ్వు?" అని చిరునవ్వుతో అడిగారు. అప్పుడు మదికొచ్చింది..ఆ చిరునవ్వు మాటున దాగిన మమత. వీరెవరో కాదు అప్పుడు నన్ను ఏంతో ప్రేమతో తన కుటుంబంలోని ఒక వ్యక్తిగా చూసుకున్న పెద్దాయన.  కళ్ళలో నీళ్ళు తిరిగాయి..చాలా ఏళ్లకు చూసానన్న ఆనందంతో గుండెలోతుల్లో భావోద్వేగాలు ఉప్పొంగుతున్నాయి. క్షమించండి..తొలుత గుర్తుపట్టలేదు.. బాగున్నారా మీరు అనడిగా?  వారు తలూపారు..అదే బాగు అన్నట్లు. ఏంటి..ఇందనక ఏదో ఆందోళనలో ఉన్నట్లు కనిపించావు  అని అడిగారు. చెప్పాను అసలు విషయం. పర్లేదు.. రైల్ మళ్ళీ వెనక్కి తిరిగినప్పుడు నీవు దిగాల్సిన స్థలంలో దిగిపోవచ్చు అని భరోసాగా చెప్పారు.  అయితే అలా దిగకపోబట్టే వారిని చూసే అవకాశం వచ్చిందని చెప్పా. వారు సంతోషి౦చారు.

ఇద్దరం కూర్చుని నాటి కబుర్లని గుర్తుతెచ్చుకుని మరీ మాట్లాడుకున్నాం. పెళ్ళయిందా అని అడిగారు. అయిందని, జీవితభాగస్వామీతో సహా వారి పాతఇంట్లోనే ఉంటున్నానని చెబితే ఆన౦దించారు. మా ఆవిడ గురించి వివరాలు కనుక్కున్నారు. అలా కబుర్లు చెప్పుకుంటూ మాటల మధ్యలో మా యావిడీ ఫలానా చలనచిత్రం చూడాలని వద్దన్నా పట్టుబట్టి ఇతర తోటి గృహిణులతో కలిసి వెళ్ళిందని చెప్పను. అందుకు వారు... ఆ చలనచిత్రమా..అంత బావుండదే..అయినా కొద్దిరోజులాగితే సి.డి కొనుక్కుని చూడొచ్చుగా అన్నట్లు చెప్పారు. చెబితే వినదులెండి అని చెప్పి ఒక నవ్వు నవ్వాను.

ఇంతలో రైల్ ఒక వీధీ మధ్యలో ఆగింది.  కిటికీ గుండా బయటికి చూస్తే ఆ వీధి అంతా చిరపరిచితంగా అనిపించింది. హాశ్చర్యం..అదే వీధి.. కుడివైపు అమ్మవారి చిన్నగుడి..ఎదురువీధిలో అంటే ఎడమవైపున పెద్దగుడి..నాడు ఆ వీధిలో ఉద్యోగం కోసం తిరిగిన వైనం గుర్తుకువచ్చి ఆనందంతో ఈ విషయాలన్నీ ఆ పెద్దాయనకి వివరిస్తున్నా..వారు "ఊ" కొడుతున్నారు..

అక్కడితో ఆగిపోయింది కల. తర్వాత ఏమి జరిగిందో..మరో మూడేళ్ళు వేచి చూడాలో మరి :). ముందు చెప్పినట్లు ఒక కలకి అనుబంధంగా మరో కల  అదీ రమారమీ మూడేళ్ళ తర్వాత  పాతవి గుర్తు చేస్తూ రావడం చాలా  గమ్మత్తుగా..హాశ్చర్యాన్ని కలిగించింది. అన్నిటికీ మించిన వింత ఆ ప్రదేశాలూ, స్థలాలని ఇంతవరకూ నేనెప్పుడూ చూడలేదు. మరదే కదా కల అంటే..!